Hot Posts

6/recent/ticker-posts

హాస్టల్ లో బాలుడి మృతికి ముగ్గురిని సస్పెండ్ చేస్తూ బాలుడి తండ్రికి 10 లక్షల చెక్కును అందచేసిన మంత్రి పీడిక రాజన్న దొర

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం:  పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ హాస్టల్ లో సిసి కెమెరాలు ఏర్పాటుతోపాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పీడిక రాజన్న దొర అధికారులను ఆదేశించారు. బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ హాస్టల్ లో బాలుడి గోగుల అఖిల్ వర్ధన్ రెడ్డి మృతి సంఘటనపై బుధవారం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ పాఠశాలలో బాలుడి తల్లితండ్రులను కలిసి ఓదార్చి, తన తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. ఈ సందర్భంగా మంత్రి రాజన్న దొర మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా బాధాకరమైనదని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటలను పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, పరిస్థితి చక్కబడే వరకు హాస్టల్ లో భద్రత కొరకు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలనీ అధికారులను ఆదేశించారు. 


హాస్టల్ లో చదువుతున్న పిల్లలు రక్షణ, సంరక్షణ బాధ్యత సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ దేనన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించి బాలుని మృతికి కారణమైన హాస్టల్ సిబ్బంది ముగ్గురిని వెంటనే సస్పెండ్ చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. బాలుని హత్యపై పోలీసు అధికారులు  సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నారని, నిందితులను గుర్తించిన వెంటనే వారికి క్రిమినల్ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షిస్తామన్నారు.  హాస్టల్ విద్యార్థులకు సంబందించిన తల్లితండ్రులు తాము హాస్టల్లో కొన్ని రోజులు బస చేసేందుకు సుముఖత తెలియజేస్తే, వారికి ఉచిత బస, భోజన సౌకర్యాలు కలుగచేయడంతో పాటు గౌరవేతనం కూడా చెల్లిస్తామన్నారు. వారి పిల్లలకు కూడా ధైర్యంగా ఉంటుందన్నారు. 

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 10 లక్షల రూపాయల చెక్కును  బాలుడు  తల్లితండ్రులకు మంత్రి అందజేశారు. బాలుడి తండ్రి ప్రస్తుతం వాలంటీర్ గా పనిచేస్తున్నారని, వారి కోరికపై అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం, జగనన్న ఇల్లు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  అదే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న మృతుని అన్న కు ఇక్కడ విద్య కు తమ్ముడు జ్ఞాపకాలతో సమస్యగా ఉంటె వారు కోరుకున్న ప్రాంతంలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్య అందిస్తామన్నారు.


ముందుగా ఘటనా స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం  గిరిజన సంక్షేమ పాఠశాలలోని 6,7,8,9,10 తరగతులను పరిశీలించి పాఠశాలల్లో  మౌలిక సదుపాయాలు పరిశీలించి, విద్యార్థులను కలిసి వారి సమస్యలను మంత్రి అడిగి  తెలుసుకున్నారు.

             

అనంతరం గిరిజన సంక్షేమ హాస్టల్ చేరుకొని హాస్టల్ పరిసరాలు, గదులు, టాయిలెట్స్, నీటి సౌకర్యం, ఆర్ ఓ ప్లాంట్, భోజన  తయారీ హాలు, తదితరాలు పరిశీలించారు.  హాస్టల్ లోని సిక్ రూమ్ లో అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థితో మాట్లాడారు. అవసరమైతే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాలని హాస్టల్ సిబ్బందిని మంత్రి ఆదేశించారు. హాస్టల్ లో నిరుపయోగంగా ఉన్న బెడ్ లను పరిశీలించి, వాటికి మరమ్మత్తులు, పెయింట్ వేసి వినియోగించాలని మంత్రి సిబ్బందిని ఆదేశించారు.       

మంత్రి వెంట గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మురళి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్,  పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, ఐ టి డి ఏ  ప్రాజెక్ట్ అధికారి సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఝాన్సీ రాణి, డిడి టి.వి.ఎస్.  నాయుడు, ఈ ఈ రమాదేవి, తహసీల్దార్ శాంతి , ప్రభృతులు పాల్గొన్నారు.