Hot Posts

6/recent/ticker-posts

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక సైట్‌లా మోసం చేస్తున్న ఫేక్ వెబ్‌సైట్లు, వీటిని గుర్తించేదెలా?


హైదరాబాద్‌లో ఉంటున్న సుందరం వేసవి సెలవుల్లో కుటుంబంతో సహా తిరుమల వెళ్లి శ్రీవారికి మొక్కు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా, ఇంటర్నెట్‌లో ‘టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్’ అని టైప్ చేశారు. వచ్చిన సైట్‌లో దర్శనం తేదీ సెలక్ట్ చేసుకుని, తమ వివరాలన్నీ ఎంటర్ చేసి, ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేసి, టికెట్స్ ప్రింటవుట్ తీసుకున్నారు. వెళ్లాల్సిన తేదీ రానే వచ్చింది. కుటుంబంతో సహా తిరుమల చేరుకుని, క్యూ ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ చూపించారు.

వాటిని స్కాన్ చేసిన సిబ్బంది ‘అవి నకిలీ టికెట్స్’ అనడంతో సుందరం నిర్ఘాంతపోయారు. కాస్త కోలుకున్నాక, వివరాలు ఆరా తీస్తే, తాను దర్శనం టికెట్స్ కొన్నది నకిలీ వెబ్‌సైట్‌లో అనే విషయం తెలిసింది. సుందరం విషయంలోనే కాదు, చాలా మందికి ఎదురైన అనుభవం ఇది.


టికెట్ బుక్ చేసే సమయంలో జరిగే చిన్న పొరపాటు వల్ల డబ్బు, సమయం, ప్లానింగ్ అంతా వృథా అవుతుంది. ఏటా తిరుమల దర్శనానికి వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యం కోసం టీటీడీ ఒక అధికారిక వెబ్‌సైట్ రూపొందించింది. అచ్చుగుద్దినట్టు అలాగే ఉండే వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు తయారుచేస్తుండడంతో ఇలాంటి చిక్కులు వస్తున్నాయి. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల వల్ల అటు భక్తులతోపాటూ, ఇటు టీటీడీకి కూడా చాలా నష్టం, చెడ్డపేరు వస్తోంది.




తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు ముందే దర్శన టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ వెబ్‌సైట్ రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి తమకు అందుబాటులో ఉన్న తేదీలకు దర్శనం స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా పే చేసి, టికెట్ ప్రింటవుట్ తీసుకుంటే, ఆ తేదీన నేరుగా క్యూ లైన్లోకి ప్రవేశం కల్పిస్తోంది.

దీనికి పెద్ద ఎత్తున స్పందన కూడా వస్తోంది. ప్రతి నెలా 300 టికెట్లు ఆన్ లైన్ ద్వారా బుక్ అవుతుంటాయని టీటీడీ చెబుతోంది. టీటీడీకి కాసులు కురిపిస్తున్న ఈ సౌకర్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు. టీటీడీ వెబ్‌సైట్ ద్వారా అసలు బుకింగ్ ఎలా జరుగుతుంది, సైబర్ మోసగాళ్లు దీన్ని ఎలా క్యాష్ చేసుకుంటున్నారో బీబీసీ పరిశీలించింది.



టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ఎలా ఉంటుంది?
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెలా 300 రూపాయల దర్శనం స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రతి నెలా 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో టికెట్ల కోటా విడుదల చేస్తుంది.

టీటీడీ ఒరిజినల్ వెబ్‌సైట్ లింక్ ఇలా ఉంటుంది.

https://tirupatibalaji.ap.gov.in/

మొదట టీటీడీ వెబ్ సైట్లో లాగిన్ కాగానే, మన మొబైల్ నంబర్ అడుగుతుంది. తర్వాత మన మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయగానే లాగిన్ అవుతాం. దీనికి కొంత టైమ్ పడుతుంది. ఒక్కసారి లాగిన్ అయితే ఆరుగురికి మాత్రమే టికెట్ బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది.

టికెట్ బుక్ చేసే ముందు మనకు ఆయా నెలల మీద రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ గడులు కనిపిస్తాయి. గ్రీన్ ఉన్న తేదీలు మాత్రమే ఖాళీ ఉన్నట్టు లెక్క. రెడ్ ఉంటే కోటా ఫుల్ అయిందని, ఎల్లో ఉంటే వేగంగా పూర్తవుతున్నాయని, బ్లూ ఉంటే కోటా విడుదల చేయలేదని గుర్తు. మనం దర్శనం చేసుకోవాలని అనుకుంటున్న తేదీ ఉన్న గ్రీన్ గడిపై క్లిక్ చేస్తే, టికెట్ బుక్ చేసుకోవడానికి వివిధ ఆప్షన్స్ వస్తాయి. ఏ సమయం స్లాట్‌లో ఎన్ని టికెట్లు ఖాళీ ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది.

మనకు కావాల్సిన సమయం ఎంచుకుని, ఆప్షన్స్ ఎంచుకుంటే, అక్కడే లడ్డూ కూడా బుక్ చేసుకునే సౌకర్యం కనిపిస్తుంది. అవన్నీ చేశాక, దర్శనానికి వెళ్లే వారి పేర్లు అడుగుతుంది. అక్కడ పేరు, వయసు, జెండర్ ఎంటర్ చేసి, వారికి మనం ఏ గుర్తింపు కార్డ్ అటాచ్ చేస్తున్నామో వివరాలు నమోదు చేయాలి. అంటే ఆధార్ నంబర్, లేదా మరేదైనా గుర్తింపు కార్డు నంబర్ ఎంటర్ చేయాలి.

అన్నీ పూర్తి చేసిన తర్వాత కంటిన్యూ కొట్టగానే పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. అక్కడ మనం యూపీఐ, నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే, పేటియం, డెబిట్ కార్డ్ లాంటి ఆప్షన్స్ ఎంచుకుని పేమెంట్ చేయగానే, మన దర్శనం టికెట్ కన్ఫర్మ్ అయినట్టు చూపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకోవడం, లేదా మెయిల్ పంపడం గానీ, షేర్ చేయడం గానీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆ టికెట్‌లో ఉన్న తేదీ, సమయం ప్రకారం స్లాట్ దర్శనానికి వెళ్లచ్చు. సిబ్బంది ఆ టికెట్ స్కాన్ చేసి లోపలికి అనుమతిస్తారు. ఇది ఒరిజినల్ సైట్‌లో జరిగే ప్రాసెస్.






నకిలీ వెబ్‌సైట్ ఎలా ఉంటుంది?
టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎలాంటి ప్రక్రియ ఉంటుందో నకిలీ వెబ్‌సైట్లలో కూడా మనకు అలాంటి ప్రాసెస్ కనిపిస్తుంది. అచ్చు గుద్దినట్లు ఒరిజినల్ లాగే ఉంటాయి. కానీ ఒక విషయం గమనిస్తే అది అసలా, నకిలీనా అనేది మనం పట్టేయవచ్చు. ఒరిజినల్‌లో మనకు కోటా విడుదలైన సమయంలో ప్రతి నెలా 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ మాత్రమే రకరకాల రంగుల గడులు కనిపిస్తే, నకిలీ వెబ్ సైట్‌లో టికెట్లు మాత్రం గ్రీన్ కలర్లో నిత్యం అందుబాటులో ఉన్నట్టు కనిపిస్తుంది.

అలా కనిపించినపుడే మనం సందేహిస్తే, మోసగాళ్ల ఉచ్చులో పడకుండా ముందే జాగ్రత్తపడవచ్చు. అది గుర్తించకుండా మనం మామూలుగా మన వివరాలన్నీ ఎంటర్ చేసి, ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే, అది పేమెంట్ వరకూ తీసుకెళ్తుంది. తర్వాత టికెట్ కూడా కనిపిస్తుంది. ఒరిజినల్, నకిలీ తేడాను ఏమాత్రం గుర్తించలేని విధంగా టికెట్ మీద స్కాన్ కోడ్‌ కూడా ఉంటుంది. బుక్ చేసిన వారు అది అసలు టికెట్ అని భ్రమపడి ట్రావెల్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటారు. దర్శనం దగ్గర సిబ్బంది స్కాన్ చేసేవరకూ అది నకిలీ అని గుర్తించలేకపోవడంతో దారుణంగా మోసపోతున్నారు.

ఇటీవల నకిలీ టికెట్ల గురించి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఒక నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించిన టీటీడీ ఐటీ విభాగం, దానిని తొలగించడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదంటే సైబర్ మోసగాళ్లు వీటిని ఎంత పకడ్బందీగా రూపొందిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.



నకిలీకి, అసలుకు తేడా ఎలా కనిపెట్టాలి?
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఆ నకిలీ వెబ్ సైట్ ఇది

https://tirupatibalaji-ap-gov.org/

ఇక్కడ మనం గమనిస్తే అసలు వెబ్‌సైట్‌కూ నకిలీ వెబ్‌సైట్‌కూ చాలా స్వల్ప తేడాలు ఉన్నాయి. తిరుపతి బాలాజీ పక్కన వచ్చే ఏపీకి ముందూ, వెనకా ఒరిజినల్ సైట్‌లో డాట్(.) ఉంటే, నకిలీ వెబ్‌సైట్లో హైఫన్(-) ఉంది. తర్వాత ఒరిజినల్ సైట్ చివర్లో gov తర్వాత .in ఉంటే, నకిలీ వెబ్‌సైట్‌లో gov తర్వాత .org ఉంది. టీటీడీ ఈ నకిలీ వెబ్‌సైట్‌ను తొలగించడానికి ప్రయత్నించినా, అది చాలా సెక్యూర్‌గా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఈ వెబ్‌సైట్‌పై ఏపీ పోలీసులు అమెరికాకు చెందిన ఇంటర్నెట్ డొమైన్ రిజిస్టర్, వెబ్ హోస్టింగ్ కంపెనీ గోడాడీకి ఫిర్యాదు చేశారు. టీటీడీకి, పలువురు భక్తులకు నష్టం తీసుకొచ్చిన ఈ వెబ్‌సైట్‌ను తక్షణం తొలగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో, ఆ నకిలీ వెబ్‌సైట్‌ మూతబడినట్టే ఉంది. ప్రస్తుతం గూగుల్ సెర్చ్‌లో మాత్రమే కనిపిస్తోంది, కానీ ఓపెన్ అవడంలేదు. దర్శనం టోకెన్లు విడుదలైన సమయంలో లక్షల రూపాయల లావాదేవీలు జరిగే టీటీడీ వెబ్‌సైట్‌కు నకిలీలు పుట్టుకురావడం ఇదే మొదటిసారి కాదు.

టీటీడీ గతంలో కూడా ఇలాంటి ఎన్నో ఫేక్ వెబ్ సైట్ల గురించి పిర్యాదు చేసింది. చాలా వాటిని ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది కూడా. అయినా, ఇప్పటికీ నకిలీ సైట్ల బెడద తప్పడం లేదు. అవి కూడా ఒరిజినల్‌కూ, నకిలీకి తేడా గుర్తించలేనంత పకడ్బందీగా రూపొందిస్తుండడంతో ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేయడం టీటీడీ అధికారులకు తలనొప్పిగా మారింది.



ఓటీపీతో గుర్తించలేమా?
గుర్తించవచ్చు. కానీ, దాన్ని కూడా చాలా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే మనకు వచ్చే ఓటీపీ JD-TPTBLJ నుంచి వస్తుంది. అదే నకిలీ వెబ్‌సైట్‌ పంపించే ఓటీపీ AD-ADVTOP నుంచి వస్తుంది.

ఓటీపీ TPTBLJ అంటే తిరుపతి బాలాజీ నుంచి వస్తుంది అనేది గుర్తు పెట్టుకుంటే, మనం నకిలీ వెబ్‌సైట్ ఓటీపీ వచ్చినప్పుడే మోసపోకుండా బయటపడిపోవచ్చు. కానీ, ఓటీపీ ఎంటర్ చేసే హడావుడిలో భక్తులు దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. అంతే సంగతులు. ప్రస్తుతం నకిలీ వెబ్‌సైట్‌గా చెబుతున్న ఇలాంటి స్క్రీన్‌ను గతంలో టీటీడీ తన ఒరిజినల్ వెబ్‌సైట్‌కు వాడేది. ఆ స్క్రీన్‌ను తర్వాత మార్చడంతో భక్తులు కూడా రెండిట్లో ఏది ఒరిజినల్ అనేది తెలుసుకోలేక గందరగోళానికి గురవుతున్నారు.

ఇదేవిధంగా ఇప్పటివరకూ 40 వెబ్‌సైట్లను తొలగించింది. కాగా, టీటీడీ సేవ పేరుతో మరో వెబ్‌సైట్ పుట్టుకు వచ్చింది. అందులో ఇప్పటికైతే బుకింగ్ కోసం టీటీడీ ఒరిజనల్ లింక్ పెట్టారు. కొంత కాలం తర్వాత మోసానికి పాల్పడవచ్చన్న అనుమానంతో, దీన్నీ తొలగించడానికి టీటీడీ ఐటీ విబాగం ప్రయత్నిస్తుంది. ఫేక్ వెబ్‌సైట్లపై సీరియస్‌గా ఉన్నామని టీటీడీ చేర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు.

‘‘కొన్ని దుష్ట కార్యక్రమాలు చేసేవాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి భక్తులను అయోమయానికి గురిచేసి, వారి డబ్బును దోచుకుని మోసం చేస్తున్నారు. మా విజిలెన్స్ విభాగం దానిపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. సుమారు పాతిక ముప్పై నకిలీ వెబ్‌సైట్లను మూసివేయించాం. క్రియేట్ చేసినవారిపై క్రిమినల్ కేసులు బుక్ చేశాం. వారిపై తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం’’