Hot Posts

6/recent/ticker-posts

కల్లాల్లో కన్నీళ్లు పెడుతున్న మొక్కజొన్న రైతులు

 

ఏలూరు జిల్లా, పెదవేగి: అకాల వర్షాలకు మొక్కజొన్నలు తడిచి మొలకలు వచ్చి మొక్కజొన్న రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పటికైనా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు.

సోమవారం పెదవేగి మండలంలోని అమ్మపాలెం, దుగ్గిరాల, భోగాపురం గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పర్యటించి కల్లాల్లోని అకాల వర్షాలకు తడిచి మొలకలు వచ్చిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. మొలకలు వచ్చిన మొక్కజొన్నలతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు ప్రకటించినా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదని చెప్పారు. 

ఇదే అదునుగా వ్యాపారులు ధర మరింత తగ్గించి క్వింటాల్ మొక్కజొన్నలను రూ.1600,రూ.1700 లకే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు మరింతగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1962 అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో మొక్కజొన్న రైతులు సమీకరించి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మొక్కజొన్న రైతులు పరసా దుర్గారావు,ఎం. ఏడుకొండలు,జె.రామారావు తదితరులు పాల్గొన్నారు.