ANDHRAPRADESH:ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేలు పార్టీ బలోపేతం కోసం ఎంత పనిచేస్తున్నారు, సొంత పనులు ఎలా చక్కబెట్టుకుంటున్నారు, వీరిపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న అంశాలపై గత ఎన్నికల్లో కూటమి విజయం కోసం పనిచేసిన రాబిన్ శర్మ టీంతో పాటు కేకే సర్వే టీమ్ కూడా సమగ్రంగా సర్వేలు చేసి రిపోర్టులు సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కూటమి పాలనలో ఎవరెవరిపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందన్న అంశాలు తెలుసుకునేందుకు కేకే సర్వేతో పాటు రాబిన్ శర్మ టీమ్ కూడా క్షేత్రస్దాయిలో శ్రమించాయి. ఇందులో కేకే సర్వే ఏకంగా నియోజకవర్గానికి 10 వేల అభిప్రాయాల వరకూ సేకరించినట్లు తెలుస్తోంది. రాబిన్ శర్మ టీమ్ కూడా ఆ స్ధాయిలో కాకపోయినా పరిమితంగానే జనం అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ రెండు రిపోర్టులూ ఇవాళ, రేపట్లో సీఎం చంద్రబాబు చేతికి రానున్నాయి.
అయితే ఈ రెండు రిపోర్టుల్లోనూ కూటమి ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తమైనట్లు సమాచారం. ఇప్పటికే కేకే సర్వే రాష్ట్రంలో 15 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ఓ రిపోర్ట్ ఇచ్చింది. అయితే మిగతా నియోజకవర్గాల్లో పరిస్ధితి బాగానే ఉన్నట్లు పూర్తి సర్వేలో తేల్చినట్లు సమాచారం. అలాగే రాబిన్ శర్మ టీమ్ ఇచ్చిన రిపోర్టులో సైతం కూటమి ప్రభుత్వం చాలా అంశాల్లో సానుకూలంగానే పనిచేస్తున్నట్లు ప్రజాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
అయితే ఓ విషయంలో మాత్రం ఈ రెండు సర్వేలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కొంతమంది కూటమి నేతల మధ్య సమన్వయ లోపం, ప్రభుత్వం ద్వారా చేస్తున్న మంచి పనుల్ని ప్రజలకు చేరవేయడంలో ప్రత్యక్షంగా లేదా సోషల్ మీడియా పరంగా కూటమి వెనుకబాటులో ఉన్నట్టు ఈ రెండు సర్వేలు తేల్చినట్లు సమాచారం. దీంతో పాటు ప్రభుత్వంపై ఉన్న కాస్తో కూస్తూ వ్యతిరేకత తగ్గించుకోవాలంటే ఏం చేయాలో కూడా ఈ రెండు సర్వేల్లో చెప్పినట్లు తెలుస్తోంది. ఇవి తమ చేతికి రాగానే చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
Social Plugin