Hot Posts

6/recent/ticker-posts

పవన్ వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు ప్రస్తావిస్తారన్న ప్రశ్నకు జగన్ జవాబు ఇదే!


ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా స్పష్టంగా తన అభిప్రాయాల్ని వెల్లడించారు. సాధారణంగా ఎన్నికల వేళలో ప్రముఖ చానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చే వేళలో.. ఫీల్ గుడ్ ప్రశ్నలే తప్పించి.. సూటిగా.. ఇరుకున పెట్టే ప్రశ్నలకు అవకాశం ఇవ్వరు. అందుకు భిన్నంగా తనపై వచ్చే విమర్శలు.. తన తీరును తప్పుపడుతూ ఉండే అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు అంతే సూటిగా సమాధానం ఇచ్చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.


జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని తరచూ ఎందుకు పోక్ చేస్తుంటారన్న ప్రశ్నకు బదులిచ్చిన సీఎం జగన్.. తాను పవన్ గురించి చాలా తక్కువగా మాట్లాడతానని చెప్పిన ఆయన.. ఇంకేమన్నారంటే.. ‘‘ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి నేను మాట్లాడతా. పవన్ కల్యాణ్ గురించి నేను తక్కువ మాట్లాడతా. నా స్పీచ్ మొత్తం చంద్రబాబు మీదనే. పవన్ కల్యాణ్ మీద తక్కువగా ఉంటుంది. పవన్ కల్యాణ్ లేదంటే దత్తపుత్రుడు ఇద్దరు భాగస్వాములు. 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబుకు పార్టనర్ పవన్ కల్యాణ్. చంద్రబాబు పాలన మొత్తం దత్తపుత్రుడు భాగస్వామి. చంద్రబాబు చేసిన ప్రతి పాపంలోనూ దత్తపుత్రుడికి వాటా ఉంది. ఏ రకంగా దత్తపుత్రుడు మినహాయింపు అవుతారు?’’ అని ప్రశ్నించారు.

ఇదే సందర్భంగా పవన్ పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తానో చెబుతూ.. సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘‘రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు.. అధికారం లేకున్నా క్యారెక్టర్ ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్ గా.. ఆదర్శవంతంగా నీ జీవితం ఉండాలి. ఐదేళ్లకు ఒకసారి నువ్వు భార్యల్ని మార్చి.. ఒకరుకాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు.. నీ అంతట నువ్వు ఐదేళ్లకు ఒకసారి భార్యల్ని మార్చే కార్యక్రమం చేస్తే.. నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి నిన్ను ఆదర్శంగా తీసుకొన్న వాళ్లు కూడా ఇదే మాదిరి చేయటం మొదలు పెడితే.. ఒకసారి జరిగితే పొరపాటు. రెండోసారి జరిగితే గ్రహపాటు. మూడు.. నాలుగోసారి జరిగితే అది అలవాటు. ఇది అలవాటైతే.. అలవాటుగా చేస్తుంటే.. అది తప్పు అని ఎవరైనా వేలెత్తి చూపితే.. అవును తప్పైందంటూ సారీ చెప్పాలి. ప్రజాజీవితంలో ఉండి ఇలా చేస్తే ఆడవాళ్ల జీవితాలు ఏమవుతాయి? అక్కచెల్లెళ్ల జీవితాలు ఏమవుతాయి? అన్నది వాస్తవమైన పాయింట్. ఆ విమర్శను పాజిటివ్ గా తీసుకొని.. చేసిన తప్పులకు చింతిస్తూ క్షమాపణలు చెప్పాలి. దానికి రివర్సుగా వారు మాట్లాడుతున్నారు’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ పెళ్లిళ్ల అంశంపై ఆలోచించి ప్రజలు ఓటు వేయకూడదని ఎన్నికల వేళ చెబుతారా? అన్న ప్రశ్నకు స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ‘‘తప్పనిసరిగా ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని చెబుతాం. దత్తపుత్రుడనే వ్యక్తిని ఓటు వేసే ముందు ప్రతి అక్కా చెల్లి ఆలోచన చేయాలి. ఇతడి మనస్తత్వం ఏమిటి? అన్నది ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా న్యాయం చేయగలుగుతాడా? అని ఆలోచన చేయాలి.రాజకీయనాయకుడు ఎవరైనా విలువలు ఉండాలి. విలువలు లేని రాజకీయ నాయకుడు ఉంటే రాజకీయ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ వ్యక్తి ఇప్పుడు అదే చేస్తున్నాడు’’ అంటూ తాను చెప్పాల్సింది చెప్పేశారు. తక్కువగా మాట్లాడతానని చెబుతూనే.. చాలానే చెప్పేసిన సీఎం జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.