నాషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏలూరులో ఇంటర్ డిపార్ట్మెంటల్ క్రికెట్ పోటీలు
పోలీస్, రెవెన్యూ, మీడియా, న్యాయవాదులు, ఇరిగేషన్, జడ్పీ టీముల మధ్య క్రికెట్ పోటీలు
క్రికెట్ పోటీలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించిన కలెక్టర్, ఎస్పీ
మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని 1972 మరియు 14446 టోల్ ఫ్రీ నెంబర్లకు తెలియజేయవచ్చు
ఏలూరు: మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దటమే లక్ష్యమని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వీ తెలిపారు. నాషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఏలూరు ఆశ్రమం మెడికల్ కళాశాల క్రికెట్ మైదానంలో రెండు రోజులు పాటు జరుగుతున్న ఇంటర్ డిపార్ట్మెంటల్ క్రికెట్ పోటీలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వీ ప్రారంభించారు. అనంతరం ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ క్రీడాకారులను ప్రోత్సహించారు. తొలుత పోటీలో పాల్గొంటున్న ఆరు జట్ల క్రీడాకారులను కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పరిచయం చేసుకున్నారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించడంతో పాటు మాదక ద్రవ్యాల అమ్మకం, రవాణా వంటి అక్రమ కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని 1972, 14446 టోల్ ఫ్రీ నెంబర్లకు అందించాలన్నారు. యువత మాధకద్రవ్యాల బారిన పడకుండా ఉండేలా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడం జరుగుతుందన్నారు.
ఎస్పీ కె.పి ఎస్.ఎస్. కిషోర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను వివిధ క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకునేలా చైతన్య పరచాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు రవాణా పై ప్రత్యేక నిఘా పెట్టామని, గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు రవాణా చేసే వారిపై కఠినమైన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా మీడియా, రెవెన్యూ జట్ల మధ్య తొలి మ్యాచ్ నిర్వహించగా, టాస్ గెలిచి రెవెన్యూ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి. రామ్ కుమార్, డి ఎస్ డి వో బి. శ్రీనివాసరావు, సెట్ వెల్ సీఈఓ ప్రభాకర్, ఎన్జీవో నాయకులు చోడగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Photes..
Video..
Social Plugin