పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ప్రజాగళం సభ
ఎండలు మండిపోతున్నా ప్రజల ఉద్ధృతి తగ్గడంలేదన్న చంద్రబాబు
ఫ్యాన్ నుంచి గాలి కూడా రావడంలేదని ఎద్దేవా
జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కి ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శలు
ఫ్యాన్ నుంచి గాలి కూడా రావడంలేదని ఎద్దేవా
జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కి ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కురుపాం సభకు హాజరైన ప్రజానీకాన్ని చూస్తుంటే గెలుపు ఖాయంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పోటీ చేస్తున్నారని, ఆమె ఆదివాసీ బిడ్డ అని వెల్లడించారు. మీ ఇంటిలో ఒక బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని, జగదీశ్వరిని ఆదరించాలని పిలుపునిచ్చారు.
ఎంపీగా బీజేపీ అభ్యర్థి గీత పోటీ చేస్తున్నారని, కమలం పువ్వుపై ఓటేసి ఆమెను గెలిపించాలని అన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన పార్టీ బీజేపీ అని కొనియాడారు. ఎండలు మండిపోతున్నా ప్రజల ఉద్ధృతి తగ్గడం లేదని, ఈ దెబ్బకు ఫ్యాన్ ముక్కలైపోవడం ఖాయమని, ఫ్యాన్ నుంచి గాలి కూడా రావడంలేదని, ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో పడేయాలని అన్నారు.
"ఈ జలగ జగన్ దళిత, గిరిజన ద్రోహి. అందరినీ మోసం చేశాడు. గిరిజన ప్రాంతాల్లోనూ జగన్ కు సీట్లొచ్చాయి. మొదట కొంచెం బాధపడినా, ఓట్లేశారు కాబట్టి జగన్ గిరిజన ప్రాంతాల్లో ఏవైనా పనులు చేస్తాడనుకున్నా. కానీ, ఓట్లేసే వాళ్లను కాటేసే రకం ఈ జలగ జగన్. అభివృద్ధి జరిగిందా... ఒక్క రోడ్డయినా వేశాడా? ఒక స్కూలు కట్టాడా... ఒక్కటంటే ఒక్క మేలు జరిగిందా?
ఎంతో పేదలైన గిరిజనులు ఉండే నియోజకవర్గం ఇది. అలాంటి పేదల కోసం నేను 16 పథకాలు తీసుకువచ్చాను. ఇవాళ ఆ పథకాలు ఉన్నాయా? మిమ్మల్ని కాటేయడానికి మళ్లీ మోసగాడు వస్తున్నాడు. మీకు ఓటేయం అని గట్టిగా చెప్పండి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు గిరిజన పిల్లల నైపుణ్యాభివృద్ధికి పాటుపడ్డాను. ఇప్పుడు ఉన్నాయా ఆ కార్యక్రమాలు? గిరిజన పిల్లలు మంచి పాఠశాలల్లో చదవాలని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో అవకాశం కల్పించాం. కానీ ఇప్పుడా అవకాశాలు లభిస్తున్నాయా?
గిరిజనులు బాగుంటే అతడు చూడలేడు. ఎందుకు గిరిజనులంటే అంత కక్ష? వీళ్లు పైకొస్తే ఓర్వలేరా మీరు? ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటేయండి. పేదవాళ్లందరికీ పింఛన్లు ఇస్తాను. రూ.200 పింఛను రూ.2 వేలు చేసింది నేనే. పింఛన్లు ప్రారంభించింది ఎన్టీఆర్. ఈ గిరిజనుల కోసం ఐటీడీఏ పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. క్వాలిఫికేషన్ లేకపోయినా గిరిజనులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్.
ఇవాళ హామీ ఇస్తున్నా... ఇంటివద్దనే రూ.4 వేల పెన్షన్ ఇస్తాను. ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా పెన్షన్ ఇస్తాం. వికలాంగులకు జులైలో రూ.12 వేలు వస్తాయి. ఎప్పుడైనా జలగ జగన్ ఇలాంటి ఆలోచనలు చేశాడా? జగన్ వచ్చాక బాదుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు! అన్నీ ధరలు పెరిగిపోయాయి. కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెరిగిపోయాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. మేం అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తాం.
యువతకు ఉద్యోగాలు వచ్చాయా? నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు... చేశాడా? మరి జాబ్ రావాలంటే కూటమి అధికారంలోకి రావాలి. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. కురుపాంలో ఉండే యువత కూడా ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తాం. కురుపాం యువత ఇంటి వద్ద నుంచే అమెరికాలో ఉండే కంపెనీల్లో పనిచేసేలా అవకాశాలు కల్పిస్తా.
మీ నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అందరూ జనగణన, కులగణన చేస్తారు... మేం అధికారంలోకి రాగానే యువతలో నైపుణ్య గణన చేపడతాం. ప్రతి ఒక్కరి నైపుణ్యాన్ని పెంచడానికి కృషి చేస్తాం. యువతకు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.
మహాశక్తి పథకం కింద ఆడబిడ్డలకు నెలకు.1,500 ఇస్తాం. సంవత్సరానికి రూ.18,000 చొప్పున ఐదేళ్లలో రూ.90,000 ఇస్తాం. ఇంట్లో ముగ్గురుంటే ఐదేళ్లలో రూ.2.70 లక్షలు ఇస్తాం. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తాం. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తాం.
దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అన్నదాత రైతన్నకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. భవిష్యత్ లో ఆడబిడ్డలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ వస్తుంది.
జగన్ బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా అంటున్నాడు... బటన్ నొక్కడం చాలా కష్టమంట? ఉత్తుత్తి బటన్ నొక్కడం కూడా కష్టమేనా? నాయకుడు అంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలి, ప్రజల ఆదాయాన్ని పెంచాలి, రైతులకు అండగా ఉండాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసినవాడు నాయకుడు.
నేను బటన్ నొక్కా, నేను బటన్ నొక్కా అనేవాడు నాయకుడా? ఇంట్లో ఉండే బామ్మకు నేర్పిస్తే ఆమె కూడా బటన్ నొక్కుతుంది. బటన్ నొక్కడానికి పెద్ద చదువు, తెలివి కావాలా? నరేంద్ర మోదీ కూడా బటన్ నొక్కుతున్నారు... ఆయన ఎప్పుడైనా చెప్పుకున్నారా? కానీ ఇక్కడ ఏమీ తెలియని సోమరిపోతు బటన్లు నొక్కేసి... బటన్ నొక్కా, బటన్ నొక్కా అని చెప్పుకుంటున్నాడు.
బటన్ నొక్కి నువ్వు ఎంత బొక్కావు, బటన్ నొక్కి ఎంత భారం మోపావు? నువ్వు బటన్ నొక్కి ఇచ్చింది రూ.10... నువ్వు బొక్కేసింది రూ.1000. నువ్వు మోపిన భారం రూ.100. నిన్న అంటున్నాడు... నేను బటన్ నొక్కాను, ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వడంలేదు అంటున్నాడు.
జనవరిలో నువ్వు బటన్ నొక్కావు... డీబీటీ అంటే 24 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు రావాలా, లేదా? ఫోన్ లో ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ లోకి ఒక గంటలో డబ్బులు బదిలీ అయిపోతాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా... జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్ రెడ్డీ? పేదవాళ్ల అకౌంట్లో ఎందుకు డబ్బులు పడలేదు?
ఉత్తుత్తి బటన్ల రాజకీయం వద్దు. ఇంటికిపోయే రోజు వచ్చిన తర్వాత... నేను బటన్ నొక్కాను, డబ్బులు పడలేదు అంటున్నాడు. నువ్వు నొక్కింది ఉత్తుత్తి బటన్... ఖజానా ఖాళీగా ఉంది. నువ్వు నొక్కిన బటన్ పేదలకు కాదు, దళారీలకు కాదు. నేను సవాల్ విసురుతున్నా... జనవరి నుంచి కాంట్రాక్టర్లకు రూ.16 వేల కోట్లు దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి!" అంటూ నిప్పులు చెరిగాడు.
Social Plugin