*ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలి:
*సచివాలయ పరిధిలో ఆరోగ్య మరియు పోషకాహార కమిటీ నెలలో రెండుసార్లు తప్పనిసరిగా నిర్వహించాలి
*జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
ఏలూరు జిల్లా, దెందులూరు: సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధన దిశగా సచివాలయ సిబ్బంది కృషి చేయాలని, దీనిలో ప్రధానంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సచివాలయ, వైద్య, ఐ సి డి ఎస్ సిబ్బందిని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. దెందులూరు మండలం గోపన్నపాలెంలోని రెండవ నెంబర్ సచివాలయంను గురువారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, ప్రతీ సచివాలయ పరిధిలో ఆరోగ్య మరియు పోషకాహార కమిటీ సమావేశాన్ని నెలలో రెండు సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని, సమావేశంలో ఆయా సచివాలయ పరిధిలో గర్భిణీలు, మహిళలు, పిల్లలలో రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటివి లేకుండా అంగన్వాడీ సిబ్బంది,ఏ ఎన్ ఎం లు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏ ఎన్ ఎం ., ఆశా, అంగన్వాడీ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది, తదితర సిబ్బందితో సమావేశం నిర్వహించాలన్నారు.
రక్తహీనత, పౌష్టికాహారలోపం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని గుర్తించి వారికి దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పూర్తి స్థాయి పౌష్టికాహారం అందించడంతోపాటు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వారి ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించేలా ఐ సి డి ఎస్, అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలన్నారు. సచివాలయ పరిధిలోని సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని, మండల అధికారులు సచివాలయ ఉద్యోగులు వారికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించేలా పర్యవేక్షించాలన్నారు. సచివాలయ పరిధిలోని 10 నుండి 19 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన కిషోర్ బాలికలు, 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లల ఎత్తు మరియు బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందించాలన్నారు. పాఠశాలల్లోని విద్యార్థులకు నిర్దేశించిన సమయంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.
సచివాలయ సిబ్బంది తాము చేసిన పనులను ఎప్పటికప్పుడు సంబంధిత యాప్ లలో పొందుపరచాలన్నారు. విద్యార్థినులకు మహిళల సంరక్షణ చట్టాలు, గుడ్ టచ్, బాడ్ టచ్ తదితర అంశాలను సిబ్బంది తెలియజేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పధకం కింద మెనూ ప్రకారం అందిస్తున్నారా? లేదా ? అనే విషయాన్ని, విద్యా ప్రమాణాల స్థాయిని మండల స్థాయి అధికారులు పరిశీలించి వాటిని మరింత మెరుగుపరిచేలా చూడాలన్నారు. బడి ఈడు పిల్లలు బడి బయట లేకుండా బడిలోనే ఉండేలా చూడాలన్నారు.
Download app link: install
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రత్యేక అధికారి రమణ, తహసీల్దార్ నాంచారయ్య, ఎంపిడిఓ లక్ష్మి, సర్పంచ్ కోటే నాగమల్లేశ్వరమ్మ, డా.లీల ప్రసాద్, డా. ప్రియాంక, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ డి. పద్మ భూషణం, ప్రభృతులు పాల్గొన్నారు.
Social Plugin