By: Sana tv
కాకినాడ నుంచి లోక్ సభకు ఎంపీగా ఉన్న వంగా గీతకు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ కన్ ఫర్మ్ అయినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు అయితే హై కమాండ్ నో చెప్పేసింది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఇక దొరబాబు అయితే పక్క చూపులు చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన జనసేన లోకి వెళ్తారు అని అంటున్నారు. తాను గానీ తన కుమార్తె కానీ పిఠాపురం నుంచి జనసేన తరఫున పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
ఇక వైసీపీలో గడచిన నాలుగైదేళ్ల కాలంలో కూడా దొరబాబు గీత వర్గాలు రెండూ వైసీపీలో నడచాయి. ఎమ్మెల్యే ఎంపీల మధ్య ఎక్కడా పొసిగేది కాదు. అంటే 2019 తరువాత నుంచే గీత పిఠాపురం ఎమ్మెల్యే సీటు మీద దృష్టి పెట్టారు అని అంటున్నారు. ఆమె 2009లో ప్రజారాజ్యం తరఫున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆమె మొదట్లో టీడీపీలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ మెంబర్ కూడా పనిచేశారు. వైసీపీ నుంచి లోక్ సభకు చేశారు. ఎమ్మెల్యేగా కూడా గతంలో చేశారు. ఇపుడు మరోసారి ఎమ్మెల్యే కావాలని చూస్తున్నారు. పిఠాపురం సీటులో గీతకు ప్రత్యేకంగా బలం ఉంది. ఆమె వర్గం చాలా కాలంగా సైలెంట్ గా పని చేసుకుంటూ పోతోంది. ఇక పెండెం దొరబాబుకు వ్యతిరేకత ఉందని ఆయనకు టికెట్ కి టిక్కు పెట్టేసింది వైసీపీ హై కమాండ్ అని అంటున్నారు. దొరబాబు 2004లో మొదటిసారి గెలిచారు తిరిగి ఆయన 2019లోనే గెలిచారు.
మరోసారి ఆయన పోటీ చేయాలని చూస్తున్నారు కానీ జనసేన నుంచి అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయన్నది చూడాలని అంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనా జనసేన టీడీపీ పొత్తుని గట్టిగా ఎదుర్కోని నిలబడి గెలిచే వారికే టికెట్లు అని భావించే వైసీపీ ఈ మార్పులు చేర్పులు చేస్తోంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే కాకినాడ ఎంపీ వంగా గీత ఈ విషయం మీద మీడియాతో మాట్లాడుతూ అలాంటి సమాచారం తనకేమీ లేదని ప్రచారం అని మీరే అంటున్నారుగా అని ఆమె మీడియాకు బదులిచ్చారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని అన్నారు.
జగన్ ఎక్కడినుంచి పోటీ చేయమంటే అక్కడ్నించి పోటీ చేస్తానని వంగా గీత స్పష్టం చేశారు. తాము ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. అంటే పిఠాపురం సీటు ఆమెకు కన్ ఫర్మ్ అయినట్లుగా తెలుసు అని అంటున్నారు.
అదే సమయంలో వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు జరుగుతున్న కసరత్తు మీద కూడా ఆమె వ్యాఖ్యానించారు. సంస్థాగతంగా ప్రతి పార్టీలోనూ గెలుపోటములపై కసరత్తులు జరుగుతాయని, ఎవరిని ఎక్కడ్నించి బరిలో దించాలనేది పరిశీలిస్తుంటారని వివరించారు. పార్టీ నేతలు అంతా కలసి కూర్చుని ఎక్కడ ఎవరికి అవకాశం ఇవ్వాలన్నది నిర్ణయిస్తారని ఆమె చెప్పారు. మొత్తానికి చూస్తే రెండవ జాబితాలో కచ్చితంగా వంగా గీత పేరు ఉంటుందని అంటున్నారు. ఆమె పిఠాపురం నుంచి పోటీ చేయడం ఖాయమని అంటున్నారు.
Social Plugin