Hot Posts

6/recent/ticker-posts

శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి 108 కిలోల బియ్యంతో విశేష బియ్యాభిషేకం..


ఏలూరు: జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి కాశీలో అన్నపూర్ణాదేవికి నిర్వహించే బియ్య అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. ధార్మిక, ఆధ్యాత్మిక సాధకులకు, భక్తులకు, నమ్మిన నిస్వార్థ సేవకులకు కొంగు బంగారంగా నిలవడంలో    అమ్మవారికి జరుగుతున్న ఆరాధనలతో పాటు, ఆలయ కమిటీ అంకితభావంతో కూడిన భక్తిశ్రద్ధలు, సేవలు పిలిస్తే పలికే తల్లిగా నూకాలమ్మ అమ్మవారిని భక్తులకు దగ్గర చేసాయి. ప్రతీ కార్యక్రమంలో విలక్షణం, ఆగమం చెప్పిన రీతిలో శ్రీవిద్యా సాంప్రదాయ పరిధిలో జరిపే ప్రతీసేవను నూకాలమ్మ అమ్మవారికి జరపాలన్న  ఆలయకమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు)తో కూడిన ఆలయకమిటీ కృషి మరోమారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు ధార్మిక సేవరూపంలో స్వయంగా ఆచరించి తరించేలా చేసింది.


ప్రపంచప్రఖ్యాతి శైవక్షేత్రం, ముక్తిధామం, పరమ పవిత్ర వారణాసి (కాశీ )లో కాశీ అన్నపూర్ణాదేవికి నిర్వహించే బియ్యాభిషేకం శరన్నవరాత్రి నాల్గవరోజైన బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి 108 కేజీల బియ్యంతో నిర్వహించడంతో పాటు భక్తుల జీవితాల్లో ఐశ్వర్యసిద్ధికి తండుల ప్రసాద వితరణను చేసి అన్నపూర్ణ అవతార వైశిష్ట్యాన్ని ఆచరణలో, ఆరాధనలో భక్తులకు అందించారు.

   

ప్రధానార్చకులు యర్రమిల్లి మనోజ్ శర్మ అన్నపూర్ణ వైభవాన్ని భక్తులకు వివరించారు. కాగా  పెన్మత్స రాజంరాజు, నాగలక్ష్మీదేవి దంపతులు, బంగారు శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి దంపతులు, చిలువురి సత్యనారాయణరాజు దంపతులు మరియు కంది బాలకృష్ణారెడ్డి, డాక్టర్ సీత, శ్రీ దివ్యారెడ్డి కుటుంబ సభ్యులు అమ్మ వారి అంత్రాలయ పూజలలో పాల్గొని శ్రీనూకాలమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు అందచేసి ప్రసాద వితరణ చేశారు.

  

బియ్యాభిషేకాన్ని తిలకించేందుకు,పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. పూర్వపు మున్సిపల్ చైర్ పర్సన్ బంగారు శివలక్ష్మి నేతృత్వంలో శ్రీనూకాంబికా మహిళా సేవా భక్తులు మరియు ఆలయకమిటీ విశేషరీతిలో ఏర్పాట్లు చేసి భక్తులకు సేవలు అందించినట్లు ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలిపారు.


అలాగే సాయంత్రం ఏడుగంటల నుండి హరే శ్రీనివాసా అభయాంజనేయ భజన సమాజం జంగారెడ్డిగూడెం కోలాట బృందం భజన కోలాటం నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కే. ఎల్. ఎన్. ధనకుమార్ మాట్లాడుతూ గురువారం శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణతో అమ్మ వారి దివ్య దర్శనం, నిత్య పూజ, అనంతరం ఉదయం 9గంటల నుండి శ్రీ ఫలముతో విశేష పూజ జరుగుతుందని అన్నారు, శ్రీ ఫలము అంటే ఏకాక్షి నారికేళం అని, శ్రీలక్ష్మీ స్వరూపమని, భక్తులందరూ శ్రీ ఫలముతో చేయు విశేష పూజలో పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు.

    

ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు భక్తులకు యే విధమైన అసౌకర్యం కలుగకుండా చూచి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు.