Hot Posts

6/recent/ticker-posts

టీడీపీలోకి మరో వైసీపీ ఎంపీ!


 వైసీపీ నుంచి టీడీపీలో చేరబోతున్న సిట్టింగ్‌ ఎంపీ సంజీవ్‌ కుమార్‌ కర్నూలు సీటును ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముంగిట అధికార వైసీపీకి మరో షాక్‌ తగిలింది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్‌ కుమార్‌ టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరికకు ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు. కాగా 2019లో కర్నూలు ఎంపీ స్థానం నుంచి సంజీవ్‌ కుమార్‌ వైసీపీ తరఫున గెలుపొందారు, ఆయన స్వతహాగా వైద్యుడు. ఆయన చేనేత సామాజికవర్గానికి చెందినవారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డిపై సంజీవ్‌ కుమార్‌ 1,48,889 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 


వచ్చే ఎన్నికల్లో సంజీవ్‌ కుమార్‌ కు వైసీపీ అధినేత జగన్‌ సీటు కేటాయించలేదు. కర్నూలు సీటుకు సినీ నటుడు అలీ, తదితరుల పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు కొద్దిరోజుల క్రితం కర్నూలు మేయర్‌ బీవై రామయ్య పేరును జగన్‌ ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు లోక్‌ సభ స్థానం నుంచి వైసీపీ తరఫున బీవై రామయ్య పోటీ చేయనున్నారు. మరోవైపు కర్నూలు ఎంపీ స్థానానికి టీడీపీ ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డికి ఈసారి డోన్‌ అసెంబ్లీ సీటును చంద్రబాబు కేటాయించారు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 
 
వైసీపీ నుంచి టీడీపీలో చేరబోతున్న సిట్టింగ్‌ ఎంపీ సంజీవ్‌ కుమార్‌ కర్నూలు సీటును ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీసీ ఓట్లు ముఖ్యంగా చేనేతల ఓట్లు భారీ ఎత్తున ఉన్నాయి. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన సంజీవ్‌ కుమార్‌ కు చంద్రబాబు సీటు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా 2014లో కర్నూలు నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక సైతం చేనేత సామాజికవర్గానికి చెందినవారే. ఈసారి ఆమెకు ఎమ్మిగనూరు సీటును కేటాయించారు. ఎమ్మిగనూరు నుంచి వైసీపీ తరఫున బుట్టా రేణుక అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. 

వాస్తవానికి కర్నూలు ఎంపీ సీటును ఈసారి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు వైఎస్‌ జగన్‌ సీటు కేటాయించారు. అయితే తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జయరాం స్పష్టం చేశారు. దీనికి జగన్‌ ఒప్పుకోకపోవడంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీగా సీటు కేటాయించినప్పటికీ దాన్ని వద్దనుకుని జయరాం టీడీపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. ఇప్పుడు కర్నూలు వైసీపీ సిట్టింగ్‌ ఎంపీ సంజీవ్‌ కుమార్‌ సైతం టీడీపీలోనే చేరుతున్నారు.