Hot Posts

6/recent/ticker-posts

బిగ్గెస్ట్ క్వశ్చన్ : ఏపీ కాంగ్రెస్ విత్ షర్మిల...!


విజయం మాట అటుంచి ఆమె ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. రాజకీయాల్లో గెలుపు చాలా ముఖ్యం. దాని కోసం చూసే ఓపిక కూడా ఉండాలి. ఆమె పార్టీని అలా ఉంచితే 2028లో అయినా అవకాశాలు వచ్చేవేమో. 

 

వైఎస్ షర్మిల వైఎస్సార్ తనయగా జగన్ చెల్లెలుగానే రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ఆమె జగన్ జైలులో ఉన్నపుడు పాదయత్ర చేసి వైసీపీని ఉత్సాహపరచారు అన్నది వాస్తవం. అయితే అప్పటికే ఆ పార్టీకి జగన్ అనే కొండంత అండ ఉంది. ఎవరేమి వైసీపీకి చేసినా వారి సేవలు అన్నీ కూడా జగన్ అనే కొండను అల్లుకుని మాత్రమే సాగుతూ వచ్చాయి. ఆ కొండ అన్నది లేకపోతే ఎవరు ఎంత చేసినా కూడా వేస్ట్ గానే ఉంటుంది. 

 

అలా చూస్తే వైసీపీకి ఉనికి అస్థిత్వం అన్నీ జగన్ అనే ఒక్క మాట చెప్పాల్సి ఉంటుంది. జగన్ చుట్టూ వైసీపీ అనే పార్టీ నిర్మితం అయి ఉంది. ఆ చుట్టుపక్కల ఎన్ని హంగులు చేరినా కూడా చూసేది మాత్రం జగన్ నే. ఇక వైఎస్ జగన్ లో నాయకుడు ఉన్నారని జనాలు గుర్తించారు. అది అక్షర సత్యమైంది కూడా. కఠిన పరీక్షలు ఎదురైనపుడే నాయకుడు లోపల నుంచి బయటకు వస్తారు. 


అలా వైసీపీ ఏర్పాటు తరువాత జగన్ పదహారు నెలలు జైలు జీవితం చూసినా లేక ఆయన 2014 నుంచి 2019 దాకా చేసిన కఠోరమైన పోరాటం అయినా అన్నీ జనాల కళ్ల ముందు ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు అంటే కేరాఫ్ ఫలానా లీడర్ కాదు, అధికారానికి దగ్గర దారులు పాదయాత్రలు అంతకంటే కాదు. ఆ మాటకు వస్తే ఎంతో మంది పాదయాత్రలు చేశారు కానీ అధికారం అందుకున్నది బహు కొద్ది మంది మాత్రమే. ఇక వైఎస్ షర్మిల గురించి చెప్పుకోవాలంటే ఆమె తానే చెప్పుకున్నారు జగన్న వదిలిన బాణాన్ని అని. అంటే కేరాఫ్ జగన్ అనే ఆమె పాదయాత్ర ఆనాడు చేశారు. 2019లో ఆమె పార్టీకి ప్రచారమూ చేశారు. ఆమె రాజకీయ ఆసక్తులతో 2022లో తెలంగాణాలో రాజకీయ పార్టీని పెట్టారు. ఆమె కూడా తన వంతుగా పోరాటాలు అక్కడ చేశారు. పాదయాత్ర కూడా చేశారు. 

 

అయితే విజయం మాట అటుంచి ఆమె ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. రాజకీయాల్లో గెలుపు చాలా ముఖ్యం. దాని కోసం చూసే ఓపిక కూడా ఉండాలి. ఆమె పార్టీని అలా ఉంచితే 2028లో అయినా అవకాశాలు వచ్చేవేమో. కానీ ఆమె కాంగ్రెస్ తో విలీనం అంటూ తెలంగాణా ఎన్నికల కంటే ముందే పార్టీని తగ్గించేశారు. చాప చుట్టేశారు. ఇపుడు ఆమె తెలంగాణా నుంచి ఏపీ రాజకీయాల వైపు షిఫ్ట్ అవుతారు అని ప్రచారంలో ఉంది. ఆమె తెలంగాణా గడ్డ మీద నుంచి కృష్ణా జలాల విషయంలో ఏపీ మీద విమర్శలు చేశారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా అనేక సందర్భాలలో మాట్లాడారు. తాను తెలంగాణా కోడలిని అని అక్కడే ఉంటాను చివరి దాకా రాజకీయ అని చెప్పి ఏపీకి వచ్చి రాజకీయం చేస్తే అది ఫలిస్తుందా అంటే అనుమానమే అని చెప్పాలి. 


తెలంగాణాలో కాంగ్రెస్ ఉనికి ఉంది. రేవంత్ రెడ్డి పోరాటం కలసి కాంగ్రెస్ ని గెలిపించాలి. ఏపీలో అలా కాదు కాంగ్రెస్ ఉనికి పోయి దశాబ్ద కాలం అయింది. ఇక రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాక ముందు ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచి విన్నర్ అని రుజువు చేసుకున్నారు. షర్మిల ఒక్క ఎన్నికల్లో కూడా తానే గెలవకుండా ఏపీ కాంగ్రెస్ ని గెలిపిస్తారు అనుకుంటే నమ్మదగ్గదేనా అన్న చర్చ కూడా వస్తోంది. ఏపీలో రేపటి రోజున జరిగే ఎన్నికలు అన్నా చెల్లెళ్ళ మధ్య కాదు, వైసీపీకి విపక్షాలకు మధ్యన పోరాటంగా సాగుతాయి. వైసీపీ పాలన మీద జనాలు అన్నీ చూసి తీర్పు ఇస్తారు. జగన్ చేసిన మేలు తలచుకుని ఓటేస్తారు. ఇక జగన్ కాదు అనుకుంటే సమీప ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీకి చాన్స్ ఇచ్చినా ఇస్తారు. అంతే తప్ప కాంగ్రెస్ కి ఏ మాత్రం అవకాశం ఉండదు. అయితే కాంగ్రెస్ కి ఈ విషయం తెలుసు. తన గ్రాఫ్ పెంచుకోవడం కోసం షర్మిలను ముందుకు తెస్తోంది అని అంటున్నారు. 


కాంగ్రెస్ ఓట్లు చీల్చి వైసీపీని ఓడించాలన్నదే కాంగ్రెస్ పెద్దల కోరిక తప్ప తాము గెలవాలని కాదు అని కూడా మరో మాట వినిపిస్తోంది. అలా చూసుకుంటే ఈ మధ్యలో షర్మిలకు ఏమి మేలు చేకూరుతుంది అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఏపీలో కాంగ్రెస్ ఇపుడు నోటాతో పోటీ పడుతోంది. ఆ పార్టీ అధికారంలోకి రావాలి అంటే 2029లో అయినా సాధ్యపడుతుందా అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇవన్నీ చూస్తే కనుక షర్మిల ఏపీ పాలిటిక్స్ లో ఏమి సాధించాలని ఎంట్రీ ఇస్తున్నారో కూడా చూడాల్సి ఉంది. ఆమె రాక వల్ల కాంగ్రెస్ కి కొద్దో గొప్పో ఓట్లు పెరగవచ్చు. భారీ ఓట్ల చీలిక వైసీపీలో తెస్తే టీడీపీ నెగ్గవచ్చు. మరి షర్మిలకు దక్కేదేంటి అంటే జవాబు అయితే ఈ రోజుకు లేదు. రేపటికి వస్తుందో రాదో తెలియదు. సో అన్నను ఓడించడానికి ఎదురు నిలిచిన జగనన్న బాణం అని తెలుగుదేశం మీడియా హెడ్డింగులకు మాత్రం బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు.