Hot Posts

6/recent/ticker-posts

డామన్‌హుర్: ప్రపంచంలోనే అతిపెద్ద, అద్భుతమైన భూగర్భ దేవాలయం... మూడో కంటికి తెలియకుండా దీన్ని ఎలా నిర్మించారు?


ఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాల్లో 1979లో 28 మంది సభ్యులతో కూడిన ఒక బృందం రహస్యంగా రాత్రిపూట ఒక కొండను తవ్వడం ప్రారంభించింది.

అలా తవ్వడానికి ప్రధాన కారణం, ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ దేవాలయాన్ని అక్కడ నిర్మించాలనుకోవడం.

వారు అనుకున్న పనిని పూర్తి చేశారు కూడా. కొన్నేళ్ల తర్వాత, వారు చేసిన ఈ పని ప్రపంచంలోనే అపారమైనదిగా, అద్భుతమైనదిగా నిలిచింది.

సౌందర్యాత్మక అలకరణలతో తొమ్మిది ఆలయాలను అయిదు అంచెలుగా వందల మీటర్ల సొరంగంతో అనుసంధానిస్తూ కట్టారు.

రకరకాల కళా రూపాలతో మానవాళి చరిత్రను వివరించే ఒక త్రీడీ ప్రతిమలతో ఆ ఆలయాలను నిర్మించారు. అవన్నీ భూగర్భంలోనే ఏర్పాటు చేశారు.

వీటిని టెంపుల్స్ ఆఫ్ హ్యుమానిటీ అని పిలుస్తున్నారు.

‘‘ఇవాళ ఇది వాస్తవికతకు కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయిదు జాతులకు చెందిన 1500 మందితో కూడిన అంతర్జాతీయ సమాఖ్యకు చారిత్రక రాజధాని. అదే డామన్‌హుర్" అని అక్కడే పుట్టి పెరిగి, ఈ సమాఖ్యకు అంబాసిడర్‌గా ఉన్న బారిస్ ఎల్‌బోరో బీబీసీ రీల్‌తో చెప్పారు.

పర్యావరణానికి అనుకూలంగా నిర్మించిన ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి ప్రాచీన ఈజిప్టు భూగర్భ దేవాలయం డామన్‌హూర్‌ పేరు పెట్టారు. ఈ పదానికి కాంతి నగరం అని అర్థం. గ్రీకు పురాణాల్లోని హోరస్ దేవుడికి ఈ కేంద్రాన్ని అంకితం చేశారు.

ఈ భూగర్భ దేవాలయం ఇటలీలోని తురిన్‌కి ఉత్తరాన 50 కి.మీల దూరంలో ఉంది. ఈ దేవాలయాన్ని ఒబెర్టో ఐరౌదీ(1950-2013) స్థాపించారు. ఆయన తన పేరును తర్వాత ఫోల్కో తారాస్సాకోస్‌గా మార్చుకున్నారు.

ఫాల్కోను అతని శిష్యులు చాలా మంది ఒక అద్భుత వ్యక్తిగా కొలుస్తారని యూనివర్సిటీ ఆఫ్ తురిన్ సోషియాలజీ ప్రొఫెసర్ స్టెఫానియా పాలిసానో చెప్పారు.

భూమిని, భూమిపై ఉన్న జీవులను కాపాడాలనే ‘మ్యాజికల్ మిషన్’తో 'భవిష్యత్తు నుంచి కాలంలో వెనక్కి నడిచి వచ్చిన' వ్యక్తి ఫాల్కో అని వారి నమ్మకం.

ఫాల్కో తారాస్సాకోస్‌ శిష్యులు

డామన్‌హూరియన్లు అప్పటి కాలంలో ఎక్కువగా టైమ్ ట్రావెల్ ప్రయోగాల గురించి మాట్లాడేవారు. అత్యధిక జ్ఞానోదయం పొంది ‘‘టెంపోనాట్స్(టైమ్ ట్రావెలర్)గా మారేందుకు ‘ట్రావెల్ క్యాబిన్లు’ సాయపడతాయని భావించేవారు.

సంక్షోభాల నుంచి మానవాళి రక్షించేందుకు తాను వచ్చానని ఫాల్కో చెప్పుకునేవారు.

గతంలోకి వెళ్లి ఆయన తన నేతృత్వంలో అట్లాంటీల ప్రాచీన నాగరికతగా మారే కాలనీని స్థాపించి, ప్రోత్సహించినట్లు శిష్యులు భావించేవారు.

‘‘డామన్‌హూర్ అనేది ప్రపంచంలోనే ప్రత్యేకమైనది’’ అని ఏళ్ల తరబడి ఈ కమ్యూనిటీపై అధ్యయనం చేస్తోన్న పాలిసానో చెప్పారు.

‘‘వారి సౌకర్యవంతమైన ప్రాంతాన్ని వదిలిపెట్టి ఈ క్లిష్టతరమైన మిషన్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు’’ అని తెలిపారు.

‘‘ఈ రకమైన నిర్ణయాలను ఫాల్కో ప్రోత్సహించే వారు కూడా. ఎందుకంటే తన ‘మ్యాజికల్ మిషన్’ను సాధించేందుకు, ఎక్కడైతే ‘మ్యాజికల్ టెక్నాలజీలు’ ఉంటాయో అక్కడ ఆలయాలను నిర్మించాలని ఆయన చెప్పేవారు’’ అని ఆ సోషియాలజిస్ట్ తెలిపారు.

ఫాల్కో శిష్యుల్లో ఒకరే యాంటెలోప్ వర్బెనా, ఆమె డామన్‌హూర్ అకాడమీకి చెందిన వారు.

జంతువులు, మొక్కల పేర్లను స్వీకరించే ఈ గ్రూప్ సంప్రదాయాన్ని ఆమె పేరు ప్రతిబింబిస్తోంది.

‘‘డామన్‌హూర్‌లో నివసించేందుకు నేను 1985 ఏప్రిల్ 1న ఇక్కడికి వచ్చాను.

నా తొలిరోజు చాలా ఆసక్తికరంగా అనిపించింది. మీకు చెందిన అన్ని వస్తువులను బయట వదిలేసి ఇక్కడికి వచ్చి వాస్తవంలో నివసించడం ప్రారంభించాలి’’ అని ఆమె తెలిపారు.

ఫాల్కో నేతృత్వంలోనే డామన్‌హూర్‌లోని మొదటి నివాసితులు ఆ పర్వతాల్లో తవ్వకాలు ప్రారంభించారు.

ఆలయాల నిర్మాణం చేపట్టడంలో తామందరం పాల్గొన్నామని, అదే తమ జీవితంగా ఉండేదని వెర్బెనా చెప్పారు.

రహస్యంగా...

‘‘తొలి పదిహేను ఏళ్లు ఇది రహస్యంగా సాగింది. ఎందుకంటే అప్పటికే ఇటలీలో ప్రైవేట్ భూగర్భ నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చేలా ఎలాంటి చట్టాలు లేవు’’ అని ఎల్లెబోరో అన్నారు.

ఇటలీ వంటి క్యాథలిక్ దేశంలో, మరో విశ్వాసంతో ముడిపడి ఉన్న ఆలయ నిర్మాణాలను అడ్డుకుంటారేమోనని భయపడ్డారు.

అందుకే వారు ఏ ప్లానింగ్ అనుమతులు తీసుకోలేదు. దీంతో రహస్యంగా వీరు తమ ప్రాజెక్ట్‌ను కొనసాగించారు.

ఈ విశ్వంలో ఇతరులను కూడా గౌరవించే, శ్రద్ధ చూపించే ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించే విజన్‌ ఉన్న చాలా మంది వ్యక్తులు మెల్లమెల్లగా ఈ ప్రాజెక్ట్‌లో చేరడం ప్రారంభించారు.

మెల్లమెల్లగా ఈ కమ్యూనిటీ ప్రజలు మరిన్ని ఆస్తులను కూడా సంపాదించారు.

స్థానిక కమ్యూనిటీ అవసరాలను తీర్చడానికి, జీననోపాధి కోసం చిన్న చిన్న సహకార వ్యాపారాలు, బుక్ స్టోర్లు, ద్రాక్ష తోటలు, ఇతర దుకాణాలను ఏర్పాటు చేశారు.

ఈ వ్యాపారాల యజమానులు, అలాగే తాపీ మేస్త్రీలు, కళాకారులు, రైతులు, చేతివృత్తుల వారు పగటిపూట వారి పనిచేసుకుని, రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు లేకుండా ఆలయ నిర్మాణం కోసం తవ్వేవారు.


అనుమతి లేకుండా వారు చేస్తున్న పనిని దాచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఈ రహస్యం బయటికి తెలిసిపోయింది.

జూలై 1992లో, ఆలయం దాదాపు పూర్తైనప్పుడు, డామన్‌హూర్‌పై దాడి జరిగింది.

స్టేట్ ప్రాసిక్యూటర్ అల్టిమేటం జారీ చేశారు. ‘‘మాకు దేవాలయాలు చూపించండి లేదా మొత్తం కొండను కూల్చేస్తాం అన్నారు’’

వేరే మార్గం లేకపోవడంతో ఫాల్కో, అతని సహచరులు ఆ రహస్య నిర్మాణం తలుపులు తెరిచారు.

‘‘ఒక అనామక చెక్క వెనకాల అంతటి అద్భుతమైన నిర్మాణం ఉందని ఊహించడం కూడా సాధ్యం కాదు’’ అని వెర్బెనా అన్నారు.

బంగారు ఆకుతో నిండిన పొడవైన స్తంభాలు, గోడలు, అపురూపమైన చిత్రాలతో అలకరించిన పైకప్పులు, కుడ్యచిత్రాలు, స్ఫటికాలతో తీర్చిదిద్దిన గదులను ప్రాసిక్యూటర్, ఇద్దరు పోలీసు అధికారులు చూశారు.

టెంపుల్స్ ఆఫ్ హ్యూమానిటీ

‘‘ఇది ఒక అద్భుతం. నమ్మశక్యం కాని అద్భుతం. వారు ప్రతి గదిని చూసినప్పుడు , దానిలో దాగి ఉన్న ఒక స్వాభావికమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. వారు కన్నీటి పర్యంతమయ్యారు’’ అని డామన్‌హూర్‌లోని ఒక నివాసి ఎస్పెరైడ్ అననాస్ తన పుస్తకం ‘‘డామన్‌హూర్ : టెంపుల్స్ ఆఫ్ హ్యూమానిటీ’’లో రాశారు.

"తొమ్మిది కెమెరాలు మమ్మల్నీ, అక్కడి నిర్మాణాన్నీ చూశాయి. ఆ తరువాత, ఆర్ట్ వర్క్ మాత్రం కొనసాగించండి. కొత్తగా ఇంకే నిర్మాణాలూ చేపట్టవద్దని మాకు చెప్పారు."

తరువాతి కొన్ని సంవత్సరాలకి డామహూరియన్ ప్రజలు ఈ భూగర్భ దేవాలయ ప్రాంతాన్ని తెరవడానికి, అధికారిక ఆమోదం వచ్చేంత వరకు చేపట్టిన రాజకీయ, న్యాయపరమైన పోరాటం 1996లో ముగిసింది.

"దేవాలయాలను సంరక్షించడంలో సహాయపడటానికి మేం 1,00,000 సంతకాలను సేకరించాం" అని అననాస్ చెప్పారు


‘‘దేవాలయాలు మానవత్వానికి ఒక ప్రతీక వంటివి’’ అని ఎల్లెబోరో చెప్పారు.

"ఇక్కడి ప్రతి గది మన జీవితంలోని ఒక విభిన్న అధ్యాయం గురించి మాట్లాడుతుంది, మనతో మనం సంభాషించుకునేలా చేస్తోంది, పర్యావరణంతో, సమయంతో, జనన మరణాలతో అనుసంధానమైన అనుభవాన్ని కలిగిస్తుంది’’ అని వివరిస్తూ చివరగా ఇలా అన్నారు:

‘‘అందుకే, ఇది మా దృష్టిలో మానవ ఆధ్యాత్మికతకు ఒక ఎన్‌సైక్లోపీడియా."