ఏలూరు: మహిళా సమస్యలు, నిత్యావసర ధరల నియంత్రణపై నేడు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు మహిళా సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో మహిళా సమాఖ్య ఏలూరు ఏరియా ఆధ్వర్యంలో ఏరియా కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిర అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశ్రాంత జడ్జి అడబాల లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, ధరల పెరుగుదల కారణంగా రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల కారణంగా ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీలు రద్దు చేసిన కారణంగా గ్యాస్ ధర పెరిగి పేద ప్రజల జీవితాలు చిన్నా భిన్నం అయ్యాయన్నారు. మహిళలకు నిత్యా వసరమైన గ్యాస్ ధరను రూ. 500కే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సమస్యలపై ఐక్య పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ కొండేటి బేబి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలతో పాలన కుంటుపడిందని విమర్శించారు. ఐద్వా ఏలూరు కన్వీనర్ హైమవతి మాట్లాడుతూ 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టటం మూలంగా ప్రైవేటీకరణ, సరళీకరణ ప్రభావం ప్రజలపై పడిందన్నారు.
మహిళను విలాస వస్తువుగా చూడటం దుర్మార్గం అన్నారు. ఈ విధానాలను ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, పోరాటాలే సమస్యకు పరిష్కారం అన్నారు. మహిళా నాయకురాలు మన్నవ యామిని మాట్లాడుతూ మన రాష్ట్రంలో లభించే సహజ వనరులను దోపిడీ చేస్తూ కృత్రిమ కొరత సృష్టించి కార్పొరేట్ శక్తులు ధరలను పెంచి యదేచ్చగా ప్రజాసంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. మన రాష్ట్రంలో దొరికే గ్యాస్ నిక్షేపాలను ప్రభుత్వం వినియోగిస్తే తక్కువ ధరకే గ్యాస్ ను సరఫరా చేయొచ్చని సూచించారు. పాలకుల విధానాలపై ప్రశ్నించిన వారిని గృహనిర్బంధానికి గురిచేస్తూ ఉద్యమాలను అణగదొక్కాలని ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. అక్రమ నిర్బంధాలను భయపడే ప్రసక్తే లేదన్నారు. గ్యాస్ ధర తగ్గించే వరకు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాలకుల విధానాలపై ఐక్యంగా పోరాడాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన మహిళా సమాఖ్య ఏలూరు ఏరియా కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ మహిళా సమాఖ్యను బలోపేతం చేసి సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉప్పులూరి లక్ష్మి, భవాని, గొర్లి స్వాతి, తదితరులు పాల్గొన్నారు.
Social Plugin