ఏలూరు: జిల్లాలో అధిక ఫలసాయం ఇచ్చే నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలను రైతులకు అందించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం ఆయిల్ పామ్ పంట ప్రగతిపై, మొక్కల పంపిణీ, పెంపకం, తదితర అంశాలపై ఉద్యానవన అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో 1. 45 లక్షల హెక్టర్లలో ఉద్యావన పంటలు సాగవుతుండగా, వాటిలో అధిక శాతం 75 వేల 705 హెక్టర్లలో ఆయిల్ పామ్ సాగవుతుందన్నారు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఏలూరు జిల్లా దేశంలోనే ముందు స్థానంలో ఉందన్నారు. అటువంటి ఆయిల్ పామ్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు అధికారులు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. ఆయిల్ పామ్ పంట విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద జిల్లాలోని 5 ఆయిల్ పామ్ కంపెనీలు తన సొంత నర్సరీ లేదా ఇతర నర్సరీల నుండి 9 లక్షల 57 వేల 360 ఆయిల్ పామ్ మొక్కలను పంపిణీ చేసేందుకు ఉద్యావనాల శాఖ మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. కేటాయించిన కంపెనీ తన పరిధిలోని రైతులకు స్వదేశీ లేదా దిగుమతి చేసుకున్న ఆయిల్ పామ్ సీడ్ మొక్కలను తన స్వంత ఖర్చుతో ఆయిల్ పామ్ నర్సరీలను పెంచి, హెక్టర్ కు 143 మొక్కలు చొప్పున ఆయిల్ ఆయిల్ పామ్ మొక్కలను ప్రభుత్వ నిబంధనల ననుసరించి రైతులకు పంపిణీ చేయాలన్నారు. స్వదేశీ మొక్కను 133 రూపాయలకు , దిగుమతి చేసుకున్న మొక్కను 193 రూపాయల అమ్మకం చేయాలనీ ప్రభుత్వం నిర్దేశించాడన్నారు. ఆయిల్ పామ్ మొక్కలను పొందేందుకు రైతులు తమ వివరాలను సంబంధిత రైతు భరోసా కేంద్రాల వద్ద నమోదు చేసుకోవలసి ఉంటుందన్నారు. ఆర్బికే ల నుండి రైతులు, విస్తీర్ణం, వారికి కావలసిన మొక్కలు, తదితర వివరాలు సంబంధిత హార్టికల్చర్ అధికారులకు అందుతాయని, వాటిని పరిశీలించి ఏ రైతుకు ఏ మేరకు మొక్కలు పంపిణీ చేయాలన్నది హార్టికల్చర్ అధికారులు జిల్లా కలెక్టర్ వారికి సమర్పించి అనుమతి తీసుకుంటారన్నారు. మొక్కలను పంపిణీ చేసిన రైతుల వివరాలను ఆయా కంపెనీలు హార్టికల్చర్ అధికారులకు అందించాలన్నారు. ఉద్యానవన పంటల అభివృద్ధికి సిబ్బంది 'తోట బడి ' కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆయిల్ పామ్ పంటకు అనుకూలమైన ప్రదేశాలలో భూసార పరీక్షలు నిర్వహించాలని, వాటిలో సూష్మ పోషకాల లోపాలను పరిశీలించి వాటిని అందించడం ద్వారా మరింత దిగుబడి సాధనకు కృషి చేయాలన్నారు. ఆంతేకాక ఆయిల్ పామ్ కంపెనీలు ఆయిల్ పామ్ అధిక ఉత్పాదకత సాధనకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వినియోగం తదితర అంశాలకు సంబంధించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధనకు రీసెర్చ్ మరియు అభివృద్ధి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
సమావేశంలో ఉద్యానవనాలు శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. రవికుమార్, ఉద్యానవన శాఖాధికారులు, ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫెడ్, గోద్రెజ్ అగ్రోవేట్, పతంజలి ఫుడ్స్, 3 ఎఫ్ ఆయిల్ పామ్ , నవభారత్ కంపెనీల ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.
Social Plugin