Hot Posts

6/recent/ticker-posts

చంద్రబాబు మీద కక్ష లేదంటున్న ఏపి సిఎం జగన్... నిజమేనా...?


తనకు చంద్రబాబు మీద ఎలాంటి కక్ష లేదు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతోంది అని కూడా అంటున్నారు. ఇంకా చెప్పాలీ అంటే చంద్రబాబు మీద అవినీతి కేసులు అన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలు మొదట విచారించాయని ఆ కొనసాగింపే ఏపీ సీఐడీ చేస్తోందని కూడా చెబుతూ వస్తున్నారు. మరో విషయం కూడా ఆయన చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో తాను లండన్ లో ఉన్నానని. సరే జగన్ చెప్పినవి అన్నీ కూడా నిజమే అనుకున్నా జనాలు నమ్ముతారా అన్నదే చర్చకు వస్తోంది. ఏపీలో చంద్రబాబు జగన్ ఇద్దరూ రాజకీయ ప్రత్యర్ధుల దశను ఎపుడో దాటేశారు అన్నది సగటు జనం కచ్చితమైన అభిప్రాయంగా ఉంది.


జగన్ చంద్రబాబుని బయటకు ఏమీ అనలేదు కానీ గత నాలుగున్నరేళ్ళ పాలనలో చాలా మంది టీడీపీ నేతల మీద కేసులు అరెస్టుల పర్వం కొనసాగింది. అఫ్ కోర్స్ వారు వివిధ కేసులలో ఉన్నారు అన్న దాని మీద అరెస్ట్ చేశారు. కానీ చూసిన వారికి ఇవన్నీ కక్ష సాధింపుగానే కనిపిస్తే అందులో ఆశ్చర్యం అయితే లేదు అంటున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే జగన్ హద్దులు దాటేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే ఆయనకు మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటూ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో కూర్చుని మరీ మీడియా ముందు చేసిన హెచ్చరికలు అందరూ చూశారు. జగన్ ఏ రోజూ మీడియా ముందుకు రారు కాబట్టి ఆయన ఏమీ మాట్లాడకపోయినా వైసీపీ మంత్రులు నేతలు చంద్రబాబుకు జైలే అంటూ గతంలో చాలా సార్లు ప్రకటించారు.


ఇపుడు అవన్నీ కలసి చంద్రబాబు అరెస్ట్ వెనక ఎంతటి బలమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా కక్ష సాధింపు అనే అంటున్నారు. టీడీపీ ఎటూ ఆ మాటే అంటుంది. ఏపీలోని కుడి ఎడమ తేడా లేకుండా అన్ని పార్టీలు బాబు అరెస్ట్ అక్రమం అన్యాయం అని ఘోషించాయి. ఇంత జరిగాక వైసీపీ అయితే డిఫెన్స్ లో పడింది అంటున్నారు. నిజానికి చట్టం తన పని తాను చేసుకుని పోవడం ఎపుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ చట్టం కంటే ఎమోషన్స్ రాజకీయాలలో పనిచేస్తాయి. బాబు అరెస్ట్ మీద సింపతీ ఎంత పెరిగింది అన్నది టీడీపీ కంటే వైసీపీ పెద్దలకే తెలియాలి.


ఇక చంద్రబాబు అరెస్ట్ మీద జగన్ ఎపుడూ ఓపెన్ గా పెద్దగా మాట్లాడింది లేదు. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం ఆయన ఆధారాలతోనే అరెస్ట్ చేశారు అని అంటున్నారు. ఇక తాజాగా మరోసారి ఆయన అదే మాటను చెబుతూ నాకు చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష ఎందుకు ఉంటుంది అని ప్రశ్నించారు. అలా కనుక తాను కక్షతో అరెస్ట్ చేస్తే బాబు నెల రోజులకు పైగా జైలులో ఉండేవారా అన్న లాజిక్ తో కూడిన ప్రశ్నలను సంధిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి మిత్రుడిగా పవన్ ఉన్నారు. ఏపీ బీజేపీ నిండా టీడీపీ టీం ఉంది. ఇంతమంది ఉన్నా కూడా బాబు జైలు గోడల నుంచి బయటకు రాలేదు అంటే అది కేసులో బలం తప్ప కక్ష సాధింపు కానే కాదని జగన్ అంటున్నారు.


ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఈడీ, సీబీఐ, జీఎస్టీ వంటి వాటిని ఆయన ఇందులోకి తీసుకుని వస్తున్నారు. బాబు అవినీతి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ముందే తెలుసు. అపుడు తాము ఉన్నది ప్రతిపక్షంలోనే అని అంటున్నారు. మరి జగన్ చంద్రబాబు అరెస్ట్ మీద ఇంతలా విడమరచి చెప్పిన సందర్భం ఇంతకు ముందు ఎన్నడూ లేదు. మరి ఆయన మాటల వెనక మర్మం ఏంటి అన్న చర్చ ఒక వైపు వస్తోంది. మరో వైపు జగన్ చెప్పినది నిజం అనుకున్నా జనాలు ఎంతవరకూ నమ్ముతారు అన్నది మరో ప్రశ్న. దీనికి కాలమే జవాబు చెప్పాల్సి ఉంది అంటున్నారు.