అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట: కొత్తపేట నియోజకవర్గంలో దళితుల ఐక్యత ఇష్టం లేని కొన్ని రాజకీయ దళారులు సృష్టించిన ఆటంకాల కారణంగా ఈనెల 7వ తేదీన కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో జరప తలపెట్టిన బ్లూ మార్చ్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జేఏసీ సభ్యులు వెల్లడించారు.
శనివారం రావులపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ సభ్యులు చిక్కాల సత్యప్రసాద్, కోనాల అంబేద్కర్ తదితరులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని పార్టీలకు అతీతంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల దళితుల ఐక్యతను చాటి చెప్పేందుకు ఆదివారం రావులపాలెం నుంచి ఈతకోట వరకు బ్లూ మార్చ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అకస్మాత్తుగా ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో పత్రికా ముఖంగా వెల్లడిస్తామని చెప్పారు. అధికార పార్టీ దళారులు కుట్రలు చేసి బ్లూ మార్చ్ ని అడ్డుకోగలరమో కానీ దళితుల చైతన్యాన్ని, వారికి అంబేద్కర్ పై ఉన్న అభిమానాన్ని ఏ మాత్రం తగ్గించలేరని స్పష్టం చేసారు. దళితులు అంబేద్కర్ మహాశయునిపై అభిమానంతో తలపెట్టిన బ్లూ మార్చ్ కు స్వార్ధంతో రాజకీయ రంగు పూసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారు తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
త్వరలో గ్రామ గ్రామానికి వెళ్ళి దళితుల ఆత్మ గౌరవాన్ని, ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను, రాజకీయ పన్నాగాలను బయట పెడతామని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనలను సాటి దళితులే వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడం సిగ్గుమాలిన చర్య అన్నారు. అటువంటి వ్యక్తులకు భవిష్యత్తు కాలమే తగిన గుణపాఠం చెబుతుందన్నారు.
Social Plugin